తెలంగాణ వీణ,హైదరాబాద్ : తెలంగాణ మోడల్ అంటే ఏమిటి? అంటూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఓ కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు.. . కేసీఆర్ పాలన గురించి, తెలంగాణ మోడల్ గురించి… ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వేదికగా గొప్పలు చెప్పేందుకు వెళ్తున్నారని, కానీ అసలు తెలంగాణ మోడల్ అంటే ఏమిటి? అంటూ ప్రశ్నలు వేసి విమర్శలు గుప్పించారు.’తరచుగా టీఎస్‌పీఎస్సీ పరీక్షాపత్రాలు లీక్ కావడం, పుట్టెడు అక్రమాలతో ప్రభుత్వ అసమర్థత, వైఫల్యం కారణంగా యువతలో ఆందోళన నెలకొనడం, వారు ఆత్మహత్యలకు పాల్పడుతుండటమే తెలంగాణ మోడలా? సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచి… డబ్బులు దండుకోవడం… ఆ తర్వాత పిల్లర్లు కుంగిపోవడం, పంప్‌హౌజ్‌లు మునిగిపోవడం, మోటార్లు ఈత కొట్టడమే… తెలంగాణ మోడలా?’ అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మద్యం విధానంపై ఆధారపడటమే తెలంగాణ మోడలా? అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకురావడమే.. తెలంగాణ మోడలా? అంటూ చురకలు అంటించారు.