తెలంగాణ వీణ, జాతీయం : జైపూర్ – ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ ఛౌదరి నలుగురిని కాల్చిచంపిన విషయం తెలిసిందే.. గత జూలైలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత చేతన్ తనకు ఫోన్ చేశాడని ఆయన భార్య ప్రియాంక ఛౌదరి పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఆమె కీలక వివరాలను వెల్లడించారు. ఆ రోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి చాలా పెద్ద తప్పు చేశానని చెప్పాడన్నారు. తన పై అధికారితో పాటు మరో ముగ్గురిని కాల్చి చంపానని ఆందోళన చెందాడని, ఇప్పుడు ఏంచేయాలో తెలియడంలేదని అన్నట్లు తెలిపారు.ఇప్పుడు ఏం చేయమంటావు.. నన్ను నేను కాల్చుకోనా అని చేతన్ తనను అడిగాడని ప్రియాంక చెప్పారు. అయితే, అలాంటి పనేది చేయొద్దని, పోలీసులకు లొంగిపోవాలని తాను సూచించినట్లు వివరించారు. తన భర్త చేతన్ కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ప్రియాంక తెలిపారు. చేతన్ మెదడులో ఓ క్లాట్ ఉందని, దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని వివరించారు. తన మామగారు (చేతన్ తండ్రి) ఆర్పీఎఫ్ ఉద్యోగి అని, 2007లో విధుల్లో ఉండగా ఆయన చనిపోయాడని చెప్పారు. ఆ సమయంలో చేతన్ పదో తరగతి చదువుతున్నాడని వివరించారు. పద్దెనిమిదేళ్లు వచ్చాక కాంపెన్సేటరీ గ్రౌండ్స్ కింద చేతన్ కు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చిందని, అయితే పోస్టింగ్ మాత్రం మధ్యప్రదేశ్ లో ఇచ్చారని తెలిపారు. 2018లో చేతన్ ను గుజరాత్ కు బదిలీ చేశారని, పోర్ బందర్ దగ్గర్లోని ఓ గ్రామంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడని ప్రియాంక చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతన్ తల్లి పోర్ బందర్ వెళ్లి కొడుకును చూసి వచ్చిందన్నారు. అయితే, కొడుకు మానసిక అనారోగ్యం ఆమె సందేహం వ్యక్తం చేసిందని, దీంతో చేతన్ ను న్యూరో సర్జన్ కు చూపించామని వివరించారు.