తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కూలుకని బయలుదేరిన కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. మండపేట సత్యశ్రీ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానిక సంఘం కాలనీకి చెందిన కోనె మహేష్ సత్యశ్రీ రోడ్డులోని ఎస్‌ఎస్‌వీవీ మున్సిపల్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరి ఉదయం కాలనీ నుంచి సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరాడు. బైపాస్ రోడ్డు దాటి కోళ్ల ఫారాల మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం, రోడ్డు బెర్ములు కిందికి కుంగిపోయి ఉండటం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. స్కూల్‌కు వెళుతున్న బాలుడు రోడ్డుపై మృతిచెంది ఉండటం దారిన వెళ్లే వారిని కలచివేసింది. మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీనివాస్ భవన నిర్మాణ కారి్మకుడిగా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు.