తెలంగాణ వీణ, సినిమా : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసేవాడు కానీగత కొంతకాలంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు వ్యూహం, శపథం అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. వర్మ తన సినిమాలతో ఎంత కలకలం సృష్టిస్తారో, తన వ్యాఖ్యలు, చర్యలతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ వెలుపల పోలీసులు జనాన్ని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసిన చోట వర్మ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసి “రాజమండ్రి సెంట్రల్ జైలుతో ఓ సెల్ఫీ. నేను బయట… ఆయన(చంద్రబాబు) లోపల” అంటూ తన ఫొటో పై కామెంట్ చేశారు.ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నువ్ కూడా జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి జాగ్రత్త అంటూ టీడీపీ మద్దతుదారులు కామెంట్లు పెడుతుంటే ఆర్జీవి ర్యాగింగ్ మళ్లీ షురూ చేశాడని వైసీపీ మద్దతుదారులు కామెంట్లు పెడుతున్నారు.