తెలంగాణ వీణ , జాతీయం : మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ ఎంపీనే మిశ్రా కించపరిచాడంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతల వ్యవహారం ఇలాగే ఉంటుందంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా పాల్గొన్నారు. దాతియా నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన నరోత్తమ్ మిశ్రా.. తాజాగా నాలుగో సారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.
ఈ ప్రచార సభలో మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దాతియా నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఏకంగా హేమమాలినితోనే డ్యాన్స్ చేయించామని చెప్పారు. దీంతో వేదికపై ఉన్న వారితో సహా సభకు హాజరైన జనం గట్టిగా నవ్వారు.