తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : డీపీ, జనసేన సమన్వయ భేటీలో తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవమానం జరిగిందా..? కీలక సమావేశంలో స్థానం కల్పించకపోవడం వెనుక వేరే మతలబు ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా జూనియర్లను అందలం ఎక్కించి ఆయన గుర్తింపును హరిస్తున్నారా? రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.
స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నుంచి 14 మంది సభ్యులతో కూడిన కమిటీ సుమారు 3 గంటల పాటు భేటీ అయింది. కమిటీలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చోటు లభించలేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే చేదు అనుభవమే ఎదురైంది. తన కంటే పార్టీలో జూనియర్లు నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, చివరకు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నేత పితాని సత్యనారాయణకు కూడా కమిటీలో స్థానం కల్పించడంతో బుచ్చయ్య అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లు సమాచారం. సీనియర్ నేతకు తగిన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో టీడీపీపై వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. 25 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ బలోపేతం, ఉమ్మడి వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా పనికిరారా? అని ప్రశ్నిస్తున్నారు.
సెంట్రల్ జైల్లో ఉన్న బాబుతో ములాఖత్లోనూ బుచ్చయ్యకు అవమానమే ఎదురైంది. పార్టీ అధినేతను జైలులో కలిసే అవకాశం ఒక్కసారి కూడా దక్కలేదు. తెలంగాణ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు బాబు కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ములాఖత్ అవుతున్నారు. స్థానికంగా ఉన్న, సీనియర్ నేతను ఒక్కసారి కూడా పిలవకపోవడంతో పార్టీ బుచ్చయ్యకు ఎంత ప్రాధాన్యంఇస్తోందో తేటతెల్లమవుతోందని ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు.