తెలంగాణ వీణ , హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌లో బుధవారం సాయంత్రం ఓ టీవీ చానల్ ఎన్నికలపై నిర్వహించిన చర్చావేదిక రసాభాసాగా మారింది. ఒక్కసారిగా విపక్షపార్టీల నేతలు ఎమ్మెల్యేతో పాటు స్వర్గీయ తన తండ్రిపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో వివేకానంద్ ఆగ్రహావేషానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంకాలనీ రాంలీలా మైదానంలో ఓ టీవీ చానల్ బుధవారం సాయంత్రం బహిరంగ చర్చావేదికను నిర్వహించింది. దీనికి స్థానిక శాసన సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద్‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ హాజరయ్యారు.
వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమాధానం ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే తండ్రి, దివంగత కేఎం పాండుగౌడ్‌పై శ్రీశైలంగౌడ్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. మరణించిన తన తండ్రి కేఎం పాండుపై ఆరోపణలు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బీజేపీ అభ్యర్థి శ్రీశైలంగౌడ్ చేతుల్లో ఉన్న మైక్‌ను లాక్కొన్ని నెట్టివేయడంతో చర్చావేదిక ఒక్కసారిగా రసాభాసాగా మారింది. వెంటనే చర్చావేదిక నిర్వాహకులు, పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి పంపించడంతో సమస్య పరిష్కారం అయ్యింది. అయితే ఈ విషయమై సూరారం పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.