తెలంగాణ వీణ , హైదరాబాద్ : తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏం సాధించింది? పేదలకు ఆర్థిక భరోసానిస్తూ సంక్షేమంలో జయకేతనం ఎగురవేసింది. చీకట్లను చీల్చి నిరంతర విద్యుత్తుతో పవర్‌హౌస్‌గా మారింది. సాగు, తాగునీటి గోసకు చరమగీతంపాడి జలరాశితో కళకళలాడింది. దండుగ అన్న ఎవుసాన్ని పండుగగా మార్చి 2 కోట్ల ఎకరాల మాగాణంగా నిలిచింది. గ్రామ స్వరాజ్యానికి, పట్టణ ప్రగతికి ఊపిరి లూది అభివృద్ధికి దిక్సూచిగా మారింది. ఐటీలో మేటిగా, కార్ఖానాల అడ్డాగా, బడి, గుడి, దవాఖాన ఇలా రంగమేదైనా ప్రత్యేక ముద్ర వేసింది. అజాత శత్రువుగా, రాజకీయాలకు భీష్మ పితామహుడిగా ఖ్యాతికెక్కిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కూడా సాధ్యంకాని ఓ అపురూప కలను సాకారం చేసి చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. అది కూడా కేవలం తొమ్మిదేండ్లలోనే! వ్యవసాయరంగంలో పలు విప్లవాలకు సమగ్ర సూచికగా చెప్పుకొనే ‘రెయిన్‌బో రివల్యూషన్’ను తొమ్మిదేండ్లలోనే సాకారం చేసి చూపించిన తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణ.
సమైక్య పాలనలో కరువు, పేదరికంతో తల్లడిల్లిన తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయం పండుగైంది. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణను రూపొందించడంతోపాటు పక్కాగా అమలు చేస్తున్నది. అందుకే ‘రెయిన్‌బో రివల్యూషన్’కి కీలకమైన ఏడురంగాల్లో తెలంగాణ ఏటా 13 శాతం వృద్ధితో దూసుకుపోతూ గడిచిన తొమ్మిదేండ్లలో సగటున 117 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒకవైపు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నుంచి చెక్‌డ్యాంల వంటి సూక్ష్మ నిర్మాణాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను జల భాండాగారంగా మార్చింది. అదే సమయంలో రైతుబంధు, రైతుబీమా, సమృద్ధిగా ఎరువులు అందించటంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయం చేశారు.
గొర్రెల పంపిణీతో మాంసం ఉత్పత్తి అదే స్థాయిలో పెరిగింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని స్థాయికి చేరుకొన్నది. ఆయిల్‌పామ్ మిషన్ ద్వారా పామాయిల్ ఉత్పత్తిలో మూడేండ్లలోనే అద్భుత అభివృద్ధిని సాధించింది. ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తే ఎంతటి ప్రగతి సాధ్యమవుతుందనేందుకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి.