తెలంగాణ వీణ , జాతీయం : ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తల కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్‌లకు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఇదే కావడం విశేషం. మంగళవారం రోజున ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ పతకాలను అందజేశారు.
అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం కాలిఫోర్నియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. లారెన్స్ బెర్కిలీ నేషనల్ ల్యాబ్‌లో సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు. సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయన ఆవిష్కకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. శుద్ధ నీరు, ఇంధనం, శానిటేషన్ డెవలప్మెంట్‌కు అవసరమైన సమర్థ సాంకేతిక విధానాలను ఆయన డెవలప్ చేశారు. ముంబైలో గాడ్గిల్ జన్మించారు. ముంబై వర్సిటీలో ఆయన ఫిజిక్స్ చదివారు. కాన్పూర్‌లో ఐఐటీ పీజీ చేశారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎంఎసీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు.
మరో శాస్త్రవేత్త సుబ్రా సురేశ్.. అమెరికాలో బయో ఇంజినీర్‌గా చేస్తున్నారు. గతంలో మాసాచుసెట్స్ టెక్నాలిజీ ఇన్స్‌టిట్యూట్‌లో డీన్ గా చేశారు. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సెన్సెస్, మెడిసిన్ రంగాల్లో పరిశోధన చేశారు. ఎంఐటీలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తిగా సురేశ్ రికార్డు క్రియేట్ చేశాడు. సైంటిస్టు సరేశ్ ముంబైలో జన్మించారు. మద్రాసు ఐఐటీలో బీటెక్ చేశారు. ఐయోవా స్టేట్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఎంఐటీ నుంచే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.