తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మచిలీపట్నం టౌన్, అక్టోబరు 24 : దాడికి గురై మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు ఎస్టీ మహిళలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు ఒడిత్యా శంకర్‌నాయక్, ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మారుమూడి విక్టర్‌ప్రసాద్‌లు మంగళవారం పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఎస్టీ కమిషన్ సభ్యుడు నాయక్ అన్నారు. బాలిక ఇంటికి వెళ్లి గాయపరిచిన కె.కొత్తపాలెం భూస్వామిని అరెస్టు చేస్తామన్నారు. బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి.. ముందుగా రూ. 50 వేల చెక్కులు అందజేశారు.
పోలీసులు, వైద్యుల తీరుపై ఆగ్రహం
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కూలికి వచ్చిన గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన భూ యజమాని రాజాచంద్‌తో పాటు అతడి సోదరి రాధికను సచివాలయ మహిళా కానిస్టేబుల్, ఎస్‌ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిధూర్జటి, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనందబాబు, జిల్లా యానాది సంఘాల అధ్యక్షుడు శ్రీనివాసరావుతో పాటు మోపిదేవి మండల రెవెన్యూ అధికారి కె.నవీన్‌కుమార్, సీఐ ప్రసాద్ పాల్గొన్నారు.
నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలి : టీడీపీ డిమాండ్
గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకులు రాజాచంద్, ఆయన సోదరి రాధిక, సచివాలయం మహిళా కానిస్టేబుల్, ఎస్‌ఐలపై తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ డిమాండ్ చేశారు. గాయపడిన మహిళలను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాచవరపు ఆదినారాయణ మాట్లాడుతూ, ఎస్సీలకు అండగా ఉంటానని చెబుతున్న సీఎం జగన్, పార్టీ నాయకులే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకుండా వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం ఆశ్చర్యమన్నారు. మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, ఎన్.వసంత తదితరులు పాల్గొన్నారు.