తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రపై వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని… భువనేశ్వరి కూడా నిజం గెలవాలి అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రారని అన్నారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబం మొత్తం అవినీతిలో మునిగిపోయిందని అన్నారు. ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్ల ఫీజులు ఎలా కట్టారని ప్రశ్నించారు. కష్టపడి పొలందున్ని సంపాదించిన రూ. 7 కోట్లతో భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.
2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగానే ఉన్నారని… ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయిందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీ పెట్టారని చెప్పారు.