తెలంగాణ వీణ , జాతీయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను క్రమబద్ధీకరించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అదేవిధంగా లాభాపేక్ష లేని సంస్థలను నిర్వహించే పారిశ్రామికవేత్తలకు మెరుగైన పని వసతులను కల్పించనుంది. నాన్ ఇమ్మిగ్రెంట్(వలసేతర) వర్కర్స్‌కు కూడా ఈ వీసా ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన విధివిధానాలను యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసె స్(యూఎ్‌ససీఐఎస్) అధికారులు ఫెడరల్ రిజిస్టర్‌లో ఈనెల 23న ప్రచురించనున్నారు. అదేసమయంలో వీసాలకు సంబంధించి కాంగ్రెస్ పేర్కొన్న ఏటా 60 వేల పరిమితిని మించరాదని నిర్ణయించారు. ఈ వీసా ఆయా సంస్థలకు మూడు నుంచి ఆరేళ్లపాటు విదేశీ కార్మికులను, ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఇస్తుంది. అయితే, హెచ్-1బీ వీసా ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తూ తరచుగా తమ వర్క్ వీసాలను రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇదిలాఉంటే, అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి.