తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వెదురుపాకలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కంచి వెంకటరమణ (38) పాల వ్యాపారం చేస్తు న్నాడు. శుక్రవారం రాత్రి పాలకేంద్రం వద్ద వ్యాపారం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటల తర్వాత కూడా రాకపోవడంతో వెంకట రమణ కు భార్య విజయలక్ష్మి కాల్ చేయగా ఫోన్ కలవలేదని సమాచారం.
ఇదిలా ఉండ గా శనివారం ఉదయం వెదురుపాక నుంచి ఆరికరేవుల వెళ్లే దారిలో వెంకట రమణ పంట బోదెలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటికి సమాచారం అందించారు. అతడి మృతదేహం కాలువలో పడి ఉండగా, మోటార్ సైకిల్ వంతెనపై ఉంది. అక్కడకు సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటం స్థానికంగా అలజడి రేపింది.
తలపై బలమైన గాయం
వెంకట రమణ తలపై బలమైన గాయం ఉండటంతో అతడిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఎవరైనా అతడిని హత్య చేశారా? లేక హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజలు చేసినట్లు సృష్టించారా అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై జి.నరేష్, ఏఎస్సై పి.వెంకటేశ్వరరావులు సిబ్బందితో సంఘటన స్థలాని కి చేరుకుని విచారణ చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, మండపేట రూరల్ సీఐ కె.శ్రీధర్ కుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు.