తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నాయకత్వాలు కలసి రాష్ట్ర భవిష్యత్ కోసం ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నామన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని, రెండు పార్టీల కలయిక ద్వారా ఏపీలో ఇంకా మెరుగైన అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కృషిచేస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఉమ్మడి ప్రణాళికతో టీడీపీ, జనసేన ఇంటింటికీ వెళ్ళే కార్యక్రమం చేపడతామన్నారు. కొత్తపేట మండలం అల్లపల్లివారిపాలెం, వానపల్లి గ్రామాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు జనసేన పార్టీ కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద భీమా చెక్కులను నాదెండ్ల మనోహర్ అందజేశారు.