తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : దసరా పండుగ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరో ఇరవై రోజుల్లో దీపావళి పండుగ ఉంది. దీంతో రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ప్రజలు జోరుగా పండగ షాపింగ్ చేస్తున్నారు.
ముఖ్యంగా వ్రస్తాలు, బంగారం, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, వాహనాల షోరూమ్‌లు కిటకిటలాడుతున్నాయి. పలు వ్యాపార సంస్థలు వివిధ రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో కొనుగోళ్ల శక్తి పెరిగిందనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు తోడు పెళ్లిళ్ల సీజన్ జత కావడంతో ఊహించిన దానికంటే అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని నెల్లూరుకు చెందిన రుక్మిణి సిల్‌్క్స ప్రతినిధి మురళి ‘సాక్షి’కి తెలిపారు.
పండుగలకు తోడు పెళ్లిళ్లు కూడా ఉండటంతో బంగారం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పలు జ్యూవెలరీ సంస్థలు భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గిపోవడంతో ప్రజలు పండుగ, పెళ్లిళ్ల కొనుగోళ్లు ముందుగానే చేసినట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 నుంచి రూ.53,000కు పడిపోయిందని, అందువల్ల అప్పుడు ఎక్కువగా నగలు కొన్నారని బంగారం వ్యాపారి మోహన్ రెడ్డి తెలిపారు. మళ్లీ ధర పెరగడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలు వెలువడుతుండటంతో తిరిగి అమ్మకాలు పెరుగుతున్నాయని మోహన్ రెడ్డి చెప్పారు.
దసరా–దీపావళి పండుగల సీజన్‌లో ఆటోమొబైల్ మార్కెట్ దూసుకుపోతోందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి సీజన్‌లో 73,240 ద్విచక్ర, 7,772 కార్ల అమ్మకాలు జరిగాయని, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఈ సీజన్‌లో అమ్మకాలు భారీగా జరిగే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 33,094 బైక్‌లు, 4,212 కార్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ రెండు పండుగల సమయంలో బైక్‌ల అమ్మకాలు లక్షకు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత దెబ్బతిన్న మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందంటున్నారు.