తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కె.తారక రామారావు మంత్రిగా రాణిస్తున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు అయిన మరెవరి పిల్లలు కూడా ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదనే చెప్పాలి. భావి ముఖ్యమంత్రి అని కూడా ప్రొజెక్టవుతున్న కేటీఆర్ 2009 లో మొదటి సారి శాసనసభకు ఎన్నికై వరుసగా నాలుగుసార్లు గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తండ్రి క్యాబినెట్‌లో మధ్యలో కొద్ది నెలలు మినహా మంత్రిగా ఉన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతున్నారు. కేసీఆర్ కుమార్తె ఒకసారి ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగాను ఉన్నారు. మాజీ ప్రధాని, మాజీ సీఎం పీవీ నరసింహారావు కుమారుడు పీవీ రంగారావు రెండుసార్లు శాసనసభకు ఎన్నికై. సుమారు నాలుగేళ్లు మంత్రిగా పనిచేశారు. మరో కుమారుడు రాజేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇదంతా పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే కావడం విశేషం. జలగం వెంగళరావు కుమారుడు ప్రసాదరావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.