తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించింది. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎంతో కీలకమైంది. కాగా, మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వివరాల ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు.