తెలంగాణ వీణ , హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూనిన సీనియర్ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్‌ను దూరం చేసుకుంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జిల్లాలోని కూకట్‌పల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించి, అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
హరివర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసిన నాయకుడు. గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. నగరంలోని హబ్సిగూడ నుంచి కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై ఐదేళ్ల పాటు పనిచేశారు. మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి తాను గెలుపు గుర్రమైనా బీసీ నినాదంతో టికెట్ రాలేదని ఆయన వాదన. దీంతో తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, సర్వే రిపోర్టులను బయటపెట్టాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.