తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎన్నికలు వచ్చాయంటే హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో భయం భయంగా ఉండేది. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ నక్సలైట్ల పిలుపు. ఎన్నికల్లో పాల్గొనా లని పోలీసుల కవాతుల మధ్య పల్లె జనాల వెన్నులో వణుకు పుట్టేది. ఎన్నికలు జరగనీయొద్దని నక్సల్స్.. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పోలీ సుల పట్టు మధ్య గ్రామస్తులు నలిగిపోయే వారు. ఎన్నికలు ముగిసి ప్రశాంతత ఏర్పడే వరకు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపే పరిస్థితులు ఉండేవి. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న అనేక గ్రామాలు నక్సల్స్ ప్రభావితంగా ఉండేవి. కాజీపేట పట్టణానికి చెందిన క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్న, మాచర్ల ఏసోబు, కడారి రాములు తదితరుల నేతృత్వంలో శివారు గ్రామాలన్నీ ఎన్నికలకు దూరంగానే ఉండేవి. కాజీపేటకు చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పల్లెల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి విజయవంతం చేయాలని అన్నలు ప్రయత్నించేవారు. భట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, అయోధ్యపురం, టేకులగూడెం, దర్గా కాజీపేట, కొండపర్తి తదితర గ్రామాల్లో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నక్సల్స్‌కు అండగా నిలిచేవారు.