తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరూ కూడా రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేయొద్దని, సరైన పత్రాలు లేకుండా వెళ్తే సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ సభ్యులతో శనివారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసులు, ఎఫ్‌ఏఎస్టీ బృందాలు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను పరిశీలించి, విడుదల చేసేందుకు జిల్లాస్థాయి గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదు, దరఖాస్తులను కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మూర్తి, సభ్యులు డీటీవో నర్సింహారావు, డీఆర్‌డీవో పద్మజారాణి పరిశీలిస్తారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఎఫ్-12లో ఉంటుందని, ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లొద్దని, దొరికిన నగదును సీజ్ చేసి, డిపాజిట్ చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధంలేదని, సరైన ఆధారాలు చూపితే తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, వివాహం ఇతర అవసరాలకు తీసుకెళ్లే వారు సరైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. సీజ్ అయిన నగదు కోసం గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ మూర్తి నంబర్ 91001 15724, సభ్యులు నర్సింహారావు 77999 34204, పద్మజారాణి 73309 99280లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని, రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వకంగా సమాధానం అందించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి సువిధ యాప్ ద్వారా, ఆన్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించాలని, ఎంసీఎంసీ ధ్రువీకరించాలన్నారు.