తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ పథకాలపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అంటూ ఓ సాధారణ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ని హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చెప్తున్న క్రమం లో.. నియోజకవర్గానికి చెందిన సాధారణ పౌరుడు అహ్మద్.. ‘మీరు చెప్తున్న ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు’ అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడాలని కోరాడు. అంతే.. ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు అహ్మద్‌ను సమావేశం నుంచి తరిమికొట్టారు. రోడ్డుపై పరుగులు పెట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు.. కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రశ్నించిన వారిని ఇలా తరిమికొడతారా అంటూ తప్పుపడుతున్నారు.