తెలంగాణ వీణ , హైదరాబాద్ : కారు.. సారు.. సర్కారు’.. గ్రేటర్‌లో అయినా, ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో అయినా జనానిది ఒకేమాట. తెలంగాణ ఎన్నికలపై శాస్త్రీయంగా నిర్వహిస్తున్న సర్వేల్లో ప్రజలనాడి స్పష్టంగా వెల్లడవుతున్నది. తాజాగా ఇండియాటీవీ సర్వేలోనూ ఇదే తేటతెల్లమైంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని ఇండియాటీవీ-సీఎన్‌ఎక్స్ సర్వే కుండబద్దలు కొట్టింది. 70కి పైగా సీట్లలో గులాబీ జెండా ఎగురనున్నదని వెల్లడించింది. ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ సర్వే కూడా ఇదే స్పష్టంచేసింది. 42.5శాతం ఓట్లతో బీఆర్‌ఎస్‌దే జయకేతనమని ప్రకటించింది. కాంగ్రెస్ 25సీట్లకే పరిమితం కానుండగా, బీజేపీ సింగిల్ డిజిట్ దాటదని తేల్చింది. మొత్తానికి ఈసారి దసరా మరింత ప్రత్యేకం. అన్ని లెక్కలూ సరిచేసి కారును ఖాయం చేసే ఎన్నికలివి అనేది మాత్రం సుస్పష్టం.
రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్ పార్టీదేనని సర్వేలు తేల్చి చెప్పాయి. శనివారం విడుదలైన రెండు సర్వే సంస్థల రిపోర్టుల్లో బీఆర్‌ఎస్ పార్టీ 70కి పైగా సీట్లు గెలుచుకొంటుందని తేలింది. ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారని పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టీవీ, ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ అండ్ రిసెర్చ్ సర్వీసెస్ సంస్థలు వేర్వేరుగా సర్వేలు నిర్వహించాయి. ఈ రెండు సర్వేల్లోనూ బీఆర్‌ఎస్ సాధారణ మెజార్టీకి మించి స్థానాలు గెలుచుకొంటుందని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 30 సీట్ల వద్దే ఆగిపోతుందని పేర్కొన్నాయి. ఇక బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లు దాటవని స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టనున్నారని తేలిపోయింది.