తెలంగాణ వీణ, సినిమా : ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ రాధ కూతురు కార్తీక పెళ్లికి రెడీ అయ్యిందా? నిశ్చితార్థం కూడా జరిగిందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఇన్‌స్టాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కార్తీక వీడియో, ఫొటోలే ఇందుకు కారణం. ఓ వీడియోలో కార్తీక సంప్రదాయిక దుస్తుల్లో మెరిసిపోయింది. మరో ఫొటోలో ఆమె చేతికున్న ఉంగరం స్పష్టంగా కనిపించింది. దీంతో, కార్తీక ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో కార్తీక, ఆమె తల్లి రాధ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 80ల్లో రాధ దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. తెలుగులో అగ్రహీరోల సరసన ఆమె పలు హిట్ చిత్రాల్లో నటించింది. ఇక కార్తీక తెలుగులో నాగచైతన్య నటించిన ‘జోష్’ సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ కార్తీక మాత్రం తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లోనూ ఆమె నటించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’లో ఆమె తళుక్కుమన్నా కూడా ఆ తరువాత ఆమెకు ఆశించిన మేర అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కార్తీక వ్యాపారంలో తన ప్రతిభ చాటుకుంటోంది. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.