తెలంగాణ వీణ , హైదరాబాద్ : చెప్పింది చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం లీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా దివంగత సాయన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పార్టీ మేనిఫెస్టో ను చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అయిపోయిందన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధరను 1200 రూపాయలకు పెంచితే 400 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన హేమా హేమీలు చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సహకారంతో సాయన్న చేశారని తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సాయన్న చేసిన సేవలకు గుర్తింపు గానే ఆయన కుమార్తె లాస్య నందితకు MLA గా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని, పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో లాస్య నందితను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, MLA అభ్యర్ధి లాస్య నందిత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.