తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు తొలుత సిరిసిల్ల, తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటా రు. ఇందుకు రెండు పట్టణాలు ముస్తాబయ్యాయి. సిరిసిల్ల మొదటి బైపాస్‌రోడ్డులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలో విశాలమైన స్థలంలో సభకు బీఆర్‌ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో సిరిసిల్ల పట్టణం గులాబీమయమైంది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందిని తరలించనుండగా, అందుకు అనుగుణంగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ముఖ్య నాయకులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సిద్దిపేట శివారులోని నాగదేవత గుడి బైపాస్‌లో సిరిసిల్ల వెళ్లే రోడ్డులో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. లక్ష మందితో జరిగే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సుమారు 20 వేల మంది బైక్ ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నది.