తెలంగాణ వీణ , జాతీయం : గర్భవిచ్చిత్తికి అవకాశం కల్పించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఆ మహిళకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. శిశువులో ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని, గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని కోర్టు చెప్పింది. గర్భానికి 26 వారాల 5 రోజుల నిండాయని, ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడం అంటే మెడికల్ టర్మినేషన్ యాక్టులోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే అవుతుందని, ఆ చట్టం ప్రకారం తల్లికి ఎటువంటి ప్రమాదం లేదని, ఇది పిండానికి సంబంధించిన కేసు కాదు అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. గుండె చప్పుడును ఆపలేమని తన తీర్పు సందర్భంగా సీజే అన్నారు. ఇద్దరు పిల్లల తల్లిని, మూడవ శిశవుకు జన్మనివ్వలేనని, డిప్రెషన్లో ఉన్నానని, గర్భాన్ని తొలగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఓ మహిళ అభ్యర్థన పెట్టుకున్న విషయం తెలిసిందే.