తెలంగాణ వీణ , జాతీయం : చంద్రయాన్-3 ప్రయోగానికి ముందే ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను చూసిన అమెరికా.. ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అమ్మాలని కోరిందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. కలాంకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘చంద్రయాన్-3 వ్యోమనౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) నిపుణులను ఇక్కడకు ఆహ్వానించాం. చంద్రయాన్-3 గురించి వివరించాం. చంద్రయాన్-3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసిన నాసా నిపుణులు.. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు..? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు అమ్మకూడదు..? అని అడిగారు’’ అని సోమనాథ్ తెలిపారు.
21న గగన్‌యాన్‌కు టీవీ-డీ1 పరీక్ష
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్ కీలక పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) పరీక్షను తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ నెల 21 నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈ పరీక్ష తర్వాత దీనికి మరో మూడు (డీ2, డీ3, డీ4) పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.