తెలంగాణ వీణ , జాతీయం : వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. శివసేనలో ఇటీవల చీలక వచ్చిన అనంతరం పార్టీని పునర్వవస్థీకరించే కసరత్తును ఉద్ధవ్ కొద్దికాలంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు. కొత్త జాతీయ కార్యవర్గంలో ఎంపీలు వినాయక్ రౌత్, అనిల్ దేశాయ్, రాజన్ విచారే, ఎమ్మెల్యేలు అనిల్ పరబ్, సునీల్ ప్రభు, రవీంద్ర వాయకర్‌లకు చోటు కల్పించారు.
శివసేన చీలక వర్గమైన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహల్ నార్వేకర్ చేస్తున్న జాప్యంపై గత శుక్రవారంనాడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో తాము గడువు కోరుతూ ఇచ్చిన ఉత్పర్వులపై సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించిది. ఈ వ్యవహారాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో కాలవ్యవధి చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి తమను సంతృప్తి పరచని పక్షంలో తామే తప్పనిసరి ఆదేశాలిస్తామని హెచ్చరించింది.