తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్యతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉండి అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు కష్టపడినా తనకుఫలితం దక్కలేదని అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ప్రాంతంలో 80 వేల పాల ఉత్పత్తి జరుగుతుందని, వారికి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
40 ఏళ్లకు పైగా తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు వెన్నంటి ఉంటూ.. కష్ట కాలంలో పెద్ద దిక్కుగా ఉన్న పొన్నాల.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదుగుతున్న బీఆర్‌ఎస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. డాలర్ లక్ష్మయ్యగా కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఎమ్మెల్యే, మంత్రి, జాతీయ స్థాయిలో పదవులు అధిష్టించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉన్న పొన్నాల, నేడు అదే పార్టీలో ఒంటరి కావడంతో తన రాజకీయ భవిష్యత్‌ను మరో పార్టీతో పంచుకోనున్నారు.