తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తమ గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉండరాదంటూ బాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు దళితులపై దాడి చేయించిన సంఘటన స్థానిక కొమ్మివారిపల్లె కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల మేరకు.. తాము వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నందున చిన్న కారణాలతో గొడవలకు దిగేందుకు టీడీపీ నేతలను కొందరు రెచ్చగొడుతున్నారని కొమ్మివారిపల్లె కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూపతిపరుడు గుంటుమణి తెలిపారు. ఆదివారం ఏ కారణం లేకుండానే దళితులు శంకరయ్య, సుబ్బయ్య, రామ్మోహన్, ఆది, మహేంద్ర, గంటుశేఖర్‌లపై దాడిచేసి గాయపరిచారన్నారు. వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సోదరభావంతో మెలిగే దళితుల మధ్య చిచ్చుపెడుతూ ఇబ్బంది పెడుతున్నారని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి, జడ్పీటీసీ సభ్యుడు దాసరి పెంచలయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ విజెలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సత్యాల రామకృష్ణ అన్నారు. గాయపడిన దళితులను ఆదివారం వారు పరామర్శించి ధైర్యం చెప్పారు.