తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు నిర్బంధాన్ని నిరసిస్తూ ఆదివారం రాత్రి నగరం, పరిసర ప్రాంతాల్లో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ఉద్యమంలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు, తటస్థంగా ఉండే మహిళలు చేతులకు గొలుసులు, తాళ్లు, రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ, ఇతర నాయకులు హాజరై చేతులను తాళ్లతో బంధించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి పోలీసులు భారీగా చేరుకోవడంపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ శాంతియుతంగా కార్యక్రమాలు చేసే సంస్కృతి తెలుగుదేశానిదన్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపి అడ్డుకున్నా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరిపురం జంక్షన్‌లో దత్ ఐల్యాండ్ వద్ద సీబీఎన్ మహిళా సైన్యం సభ్యులు భారీగా హాజరై చేతులను నల్ల రిబ్బన్లతో కట్టుకుని ఐయామ్ విత్ సీబీఎన్ ప్లకార్డులు ప్రదర్శించారు. చిన్నపిల్లలు సైతం పాల్గొన్న నిరసనలో చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సిరిపురం జంక్షన్‌లో డివైడర్‌కు ఆనుకుని నిలబడి రహదారిపై వచ్చే వాహనదారులకు ప్లకార్డులు చూపించారు.