తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడినప్పుడు తలెత్తిన పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత పలు పాలసీలు రూపొందించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిుపారు. తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలంటే సంపద పెంచి, ప్రజలకు పంచాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్ర బడ్జెట్ ను దాదాపు రూ.3 లక్షల కోట్లకు తీసుకెళ్లామన్నారు. జీఎస్డీపీ రెండున్నర రెట్లు పెంచామన్నారు. తలసరి ఆదాయం పెంచామని తెలిపారు. సంక్షేమానికి–అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమంలోనూ, క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు.
బెస్ట్ ఎకనమిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ… విజయవంతంగా అమలుచేస్తున్న ఈ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగిస్తామని కేసీఆర్ తెలిపారు.
అందరికీ సన్నబియ్యం
తెలంగాణలో ఏ పేద కుటుంబం ఆకలితో అలమటించవద్దని రేషన్ బియ్యం కోటాను పెంచుకున్నామని కేసీఆర్ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షలు జీవితబీమా కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తామన్నారు. తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ బలోపేతానికి దోహదపడతామన్నారు.
ఆసరా పెన్షన్ల పెంపు
పేదల పట్ల గౌరవంతో పింఛన్లను వేల రూపాయలకు తీసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు కేసీఆర్. రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల లబ్దిదారులందరికీ ఒక తీపికబురు చెబుతున్నామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఐదేండ్లలో రూ.5 వేలు పింఛన్ ఇస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 2,016 రూపాయల పింఛన్ ను మొదటి సంవత్సరం వెయ్యి పెంచి రూ.3,016 చేస్తామన్నారు. ఐదు సంవత్సరాలలో 5 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచామన్న కేసీఆర్… రాబోయే ఐదేళ్లలో దివ్యాంగుల పింఛన్ రూ. 6,016 చేస్తామన్నారు.
రైతు బంధు సాయం పెంపు
రైతుబంధు సృష్టికర్తనే బీఆర్ఎస్, ఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదని, మేనిఫెస్టోలో పెట్టింది కాదన్నారు కేసీఆర్. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఆలోచించి, రైతుబంధు పథకం తెచ్చామన్నారు. ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా 10,000 రూపాయలు, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్నామన్నారు. వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సాయాన్ని క్రమంగా పెంచుతూ… గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతామన్నారు. ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తామన్నారు.
అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి
బీఆర్ఎస్ మొదటి నుంచీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని కేసీఆర్ అన్నారు. చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్లమీదనే అందిస్తున్నామన్నారు. ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తుందని హామీ ఇస్తున్నామన్నారు.
రూ.400లకే గ్యాస్ సిలిండర్ పథకం
కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచి, సామాన్యుల మీద మోయలేని భారం వేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్ఎస్ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటిస్తుందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తుందన్నారు. మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని కేసీఆర్ అన్నారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధిక శాతం ప్రజలకు మునుపటికన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని రూ.15 లక్షలకు పెంచామని హామీ ఇచ్చారు.
పేదలకు ఇండ్ల స్థలాలు
రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు.
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు
తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యకు పెద్దపీట వేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయన కమిటీ
సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారని కేసీఆర్ తెలిపారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామన్నారు. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ ఏర్పాటుచేస్తామన్నారు.