తెలంగాణ వీణ , హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమదే విజయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆదివారం
తెలంగాణ భవన్ లో అభ్యర్థులతో మాట్లాడిన ఆయన.. నేతలు ప్రతి కార్యకర్తతో మాట్లాడాలని సూచించారు. విధిలేని కొన్ని పరిస్థితుల్లోనే పలువురిని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కోపాలు తగ్గించుకోవాలని… ప్రతి కార్యకర్తను కలవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతిదీ మనకే తెలుసు అనుకోవద్దని… తెలియని విషయాలను తెలుసుకోవాలని సూచించారు. కోపతాపాలను ఎమ్మెల్యే అభ్యర్థులు పక్కన పెట్టాలన్నారు. ఇవాళ 51 మంది అభ్యర్థులకు బీఫామ్ లు ఇస్తామని… మిగతా రెండు రోజుల్లో మిగతా వారికి ఇస్తామని చెప్పారు. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను కూడా స్థానిక ఎమ్మెల్యేలే తీసుకోవాలని స్పష్టం చేశారు
“బీఫామ్ లు నింపే సమయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పులు చేయవద్దు. ఏమైనా సందేహాలు వస్తే పరిష్కరించే దిశగా ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. 98480 23175 నంబర్‌కు ఫోన్ చేస్తే భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. మన పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా భరత్ కుమార్ పని చేస్తున్నారు. అభ్యర్థులకు సందేహాలు వస్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే పరిష్కారం చూపిస్తారు. పొరపాటు జరగకుండా చూసుకోవాలి” అని స్పష్టం చేశారు కేసీఆర్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్… పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సీరియస్ క్లాసే ఇచ్చారు. పిచ్చి వేషాలు వేయవద్దని…నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అలకలు పక్కనపెట్టాలని… అశ్రద్ధగా ఉండొద్దన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని… ముఖ్యంగా బీఫామ్ లు నింపే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ లో జూపల్లి ఓటమి అంశాన్ని కూడా ప్రస్తావించారు కేసీఆర్.