తెలంగాణ వీణ , హైదరాబాద్ : తమ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవడం ఖాయమని గత కొన్ని రోజులుగా చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ నేడు దానిని విడుదల చేయబోతోంది. దీనిని పూర్తి జనరంజకంగా తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, హ్యాట్రిక్ సీఎంగా పేరు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ మ్యానిఫెస్టోను పకడ్బందీగా తయారుచేసినట్టు సమాచారం.
ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పరిహారం రూ. 5 లక్షలను రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. నిరుపేద మహిళలకు జీవనభృతిగా ప్రతినెల రూ. 3000 అందిస్తారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న మహిళలను ఇందులోంచి మినహాయిస్తారు. అలాగే, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 2,016 పింఛన్‌ను రూ. 3,016కు పెంచుతారు.