తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ దారుణంగా అవమానించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీనియర్ నేత అయిన పొన్నాల లక్ష్మయ్య వయసుకైనా గౌరవం ఇవ్వకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రి వయస్సున్న వ్యక్తి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు.
శనివారం హైదరాబాద్‌లోని పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లిన కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలిసి బీఆర్‌ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇద్దరు నేతలు ఇష్టాగోష్టిగా ముచ్చటించుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొన్నాల లక్ష్మయ్య స్థాయికి, అనుభవానికి బీఆర్‌ఎస్‌లో తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ లాంటి వాళ్లకు బీఆర్‌ఎస్ సముచిత స్థానం కల్పించి గౌరవించిందని గుర్తుచేశారు.
తెలంగాణలో బీసీ సామాజికవర్గానికి చెందిన నేతగా, తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య పెద్ద నాయకుడు అని కూడా చూడకుండా రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయనను తీవ్రంగా అవమానించిందని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు? అని సూటిగా ప్రశ్నించారు.
రేవంత్ పార్టీలు మారొచ్చుగానీ ఇతరులకు తమ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం పార్టీ మారితే తప్పా? అని నిలదీశారు. దిగజారుడు సంస్కృతి ఏ రాజకీయ పార్టీకైనా మంచిది కాదని అన్నారు. పొన్నాల వంటి సీనియర్ నేతను పట్టుకొని, సచ్చేముందు పార్టీ మారటం ఏమిటని రేవంత్ తిట్టడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ కూడా నీతివాక్యాలు పలుకటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమక్షంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి దశాబ్దాలపాటు పార్టీకి సేవ చేసిన సీనియరర్ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు రేవంత్ అహంకారానికి నిదర్శమని విమర్శించారు. పొన్నాల లక్షయ్యను పార్టీలోకి ఆహ్వానించామని, ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తరువాత తన నిర్ణయాన్ని చెప్తామన్నారని పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్‌తో వెళ్లినవారిలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు.