తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది రాష్ట్రంలో ఈశాన్య ప్రాం తంలో ఉంటుంది. ఇది కలిసి వచ్చే అంశం కావడంతో బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికలకు సైతం ఇక్కడి నుంచే ‘ప్రజా ఆశీర్వాద సభల’తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ప్రతి ఎన్నికల ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. వీటన్నింటి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు హుస్నాబాద్‌తో విడదీయరాని అనుబం ధం ఉన్నది. ఈ నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాలు ఉద్యమంలో కలిసి వచ్చాయి. ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని గత ఎన్నికల్లో భారీ మెజా ర్టీ ఇచ్చాయి. అందుకే ఎన్నికల శంఖారావాన్ని మళ్లీ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నారు.