తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌కు 45 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నది. చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా 38 ఏండ్ల అపార అనుభవం ఆయన సొంతం. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకొంటున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వయసులే కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేవు. సిద్దిపేట నుంచి 1983లో కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రేవంత్‌రెడ్డి వయసు 14 ఏండ్లు (1969లో జన్మించారు). అప్పటికి ఆయన పదోతరగతి చవటంలేదు. కిషన్‌రెడ్డికి అప్పుడు 19 ఏండ్లు (1964 జన్మించారు). కేసీఆర్ యూత్‌కాంగ్రెస్ నేతగా ఊపుమీదున్నప్పుడు వీరిద్దరూ ఊహ కూడా తెలియని చిన్నపిల్లలు. ఏకబిగిన సుదీర్ఘకాలం తెలుగు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా సీఎం కేసీఆర్‌దే.
2014 జూన్ 2న తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. నేటికి అంటే 15-10-2023 నాటికి ఏకబిగిన 9 ఏండ్ల 134 రోజులుగా సీఎంగా కొనసాగుతున్నారు. అవాంతరాలు లేకుండా ఇంత సుదీర్ఘంగా సీఎంగా కొనసాగిన తెలుగు నేత మరెవరూ లేరు. కేసీఆర్ మరో రికార్డు కూడా చేరువలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ద్వారా దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు సీఎం అయిన వ్యక్తిగా నిలిచేందుకు కొద్దిదూరంలోనే ఉన్నారు.