తెలంగాణ వీణ , జాతీయం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పూజలు చేశారు. యలహంకలోని శక్తి దేవత చౌడేశ్వరి ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చిన్నప్ప, ఖాదీ బోర్డు మాజీ సభ్యుడు పాపన్న ఆధ్వర్యంలో చౌడేశ్వరిదేవికి పట్టుచీరను సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడును అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. జైలు వాతావరణం సరిపడక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బయటకు రావాలని మొక్కుకున్నట్టు తెలిపారు. అనంతరం గుడి ప్రాంగణంలో 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో పెనుకొండ టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, కేశవనాయుడు, పురుషోత్తమ్, ఓడీసీ బాబా, బాలాజి, యోగానంద, రఘురామ్, రామేశ్వరెడ్డి, బోరెడ్డి రెడ్డెప్పరెడ్డి, సుధాకరరెడ్డి, బాలాజి నాయుడు, అశోక్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ‘చంద్రబాబు వెంట మేము’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.