తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ , కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఐడీలతో పాటు స్కిల్ కుంభకోణంలో కీలక నిందితులైన మాజీ సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అప్పటి అధికారులు గంటా సుబ్బారావు, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ ఎండీ వికాస్ వినయ్ కన్వీల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, సంజయ్ డాగా, ఐఏఎస్ అధికారిణి అపర్ణ ఉపాధ్యాయ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.