తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : పూర్వపు వైభవాన్ని గణనీయంగా కోల్పోయిన టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలో బతికి బట్ట కట్టే పరిస్థితి కన్పించలేదు. తిరిగి పునఃప్రతిష్ట పొందాలనే వ్యూహంతో ఉన్నా, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్టు పరిణామం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీని ఏకతాటిపై నడిపించే నాయకత్వం లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఉనికి చాటుకునే చర్యలు మినహా ప్రత్యక్ష పోరాటం చేసే పరిస్థితి కన్పించడంలేదు. అపార ప్రజా మద్దతున్న వైఎస్సార్‌సీపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ డీలా పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. అన్ని నియోజక వర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత జిల్లాపై సీఎం సైతం ప్రత్యేక దృష్టి సారిస్తుండడం, అపార పారిశ్రామికవృద్ధి కోసం విశేష చొరవ చూపడంతో ప్రజా మద్దతు బలంగా ఉంది. ముందే అత్తెసరు పోరాటంతో వ్యవహరించే టీడీపీకి అధినేత చంద్రబాబు అరెస్టుతో స్థబ్దత ఆవహించింది. కలిసికట్టుగా పార్టీని నడిపిస్తారని భావిస్తే ఎవరికీ వారే పెద్దగా వ్యవహరిస్తూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించేందుకే నిమగ్నమైనట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
స్పష్టంగా కన్పిస్తోన్న నాయకత్వపు లోటు…
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో పార్టీని నడిపించే నాయకత్వం కరవైంది. నేతలదరి సమన్వయంతో ఒక్కతాటిపై నడిపించే సామర్ధ్యం కలిగిన బలమైన నాయకుడు ఆ పార్టీకి కరవయ్యారనే చెప్పాలి. గతంలో దివంగత నేతలు బిజివేముల వీరారెడ్డి, గుండ్లకుంట శివారెడ్డి లాంటి వారు జిల్లాలో ఏ సమస్య ఎదురైనా ముందుండి పోరాడేవారు.
ఉనికి కోసం ఆరాటం….
ఉమ్మడి జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఎవరికీ వారే ఉనికి కోసం పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరులో ఇన్‌ఛార్జి ప్రవీణ్‌తోపాటు ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, లింగారెడ్డిలతోపాటు పోట్లదుర్తి సురేష్‌నాయుడు నాయకత్వం కోసం ఆరాటపడుతున్నారు. మైదుకూరులో పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకొని ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ వేరు కుంపట్లు పెట్టుకున్నారు.