తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నీలం మధుకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న మధును పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అతనికి స్థానికంగా యువతలో మంచి క్రేజ్ ఉంది. అలాగే బీసీ సామాజికవర్గాల్లోనూ మద్దతు ఉంది. స్థానికంగా బలం, బలగం రెండూ ఉన్న మధును పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి.
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముది రాజ్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల గెలుపోటములను ప్రభావితం చేసేంత సంఖ్యలో వారు ఉన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించాలంటూ ముదిరాజ్‌లు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అతడిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గాల మద్దతును కొంత మేరకు కూడగట్టుకోవచ్చనే భావన ప్రతిపక్ష పార్టీల్లో ఉంది.
టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నీలం మధును గులాబీ పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసింది. మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. ఆయన సేవలు పార్టీకి అవసరమని, తగిన గుర్తింపు ఉంటుందని భరోసాఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
ఈనెల 16 వరకు వేచి చూస్తానని, అప్పటికీ తనకు టికెట్ ప్రకటించని పక్షంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పటాన్‌చెరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ప్రతి గడపకూ వెళ్లి సబ్బండవర్గాల ప్రజలను కలుస్తానని, వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తానని తేల్చిచెప్పారు. ఇలా అధికార పార్టీ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మీ బిడ్డగా ఎమ్మెల్యే బరిలో ఉంటున్నానని, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతానని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండా అని ఎన్‌ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం రాత్రి తన స్వగ్రామైన చిట్కుల్‌లో పలు కాలనీల్లో ఉన్న ప్రజలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామంతోపాటు పటాన్‌చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 16 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టబోయే పాదయాత్రకు అందరి ఆశీస్సులను కోరారు.