తెలంగాణ వీణ , హైదరాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం బోర్డు సభ్యులతో కలిసి లాస్యనందిత మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన కుమార్తె లాస్య నందితకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని చెప్పారు. లాస్య నందిత గెలుపు కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.