తెలంగాణ వీణ , హైదరాబాద్ : కర్ణాటకలో దోచుకుంటున్న సొమ్మను తెలంగాణకు తరలిస్తూ కాంగ్రెస్ నేతలు అడ్డంగా దొరికిపోయారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు రూ.1,500 కోట్లు తరలించే ప్లాన్ చేయగా, రూ.42 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం, ఎన్నికల్లో అడ్డదారులు తొక్కడం కాంగ్రెస్ నైజం అని విమర్శించారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు తరలించి, ఆ డబ్బు పంచి గెలవాలని కుట్రలు చేస్తున్నదని హరీశ్ ఆరోపించారు. కర్ణాటకలో గతంలో 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఉంటే, ప్రస్తుతం 50 శాతం కమీషన్ ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.42 కోట్లు పట్టుబడ్డాయని వివరించారు. కర్ణాటకలో బిల్డర్లు, గోల్డ్ మర్చంట్ అసోసియేషన్, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సుమారు రూ.1500 కోట్లు వసూలు చేసి చెన్నై మీదుగా హైదరాబాద్‌కు తరలించి అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని పేర్కొన్నారు.