తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పాల్గొన్నారు.
పాశ్చాత్య దేశాల తరహాలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ చర్చా వేదికలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పంచుకున్నారు. ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంలా ఉపయోగించుకోవడాన్ని అందరం చూశామని అన్నామలై తెలిపారు.
తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను తాగుబోతుల రాష్ట్రాలుగా తయారుచేశారన్న అన్నామలై… మద్యం అమ్మకాలతో వచ్చిన ఆదాయాన్ని ఓటర్ల కోసం వెచ్చిస్తున్నారని ఆరోపించారు. దీన్ని అభివృద్ధి మోడల్ అని చెప్పుకుంటారా అని మండిపడ్డారు. ఇది పక్కా కుటుంబ రాజకీయాల మోడల్ అని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ నికర అప్పులు రూ.75 వేల కోట్లు అయితే, ఇప్పుడవి రూ.3.13 లక్షల కోట్లకు పెరిగాయని అన్నామలై వివరించారు. తమిళనాడు దేశంలోనే అత్యధికంగా రూ.7 లక్షల కోట్ల అప్పుతో ఉందని అన్నారు.