తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు చూసినా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుతనంతో మాట్లాడుతుంటే రాష్ట్రంలో మహిళలందరూ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ వీరమహిళలు ఈ దిశగా పోరాటానికి సిద్ధం కావాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
“ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఎందుకు ఇలా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడో తేల్చుకుందాం. ఈ ముఖ్యమంత్రికి సంస్కారం నేర్పిద్దాం. అందుకోసం కార్యాచరణ రూపొందించుకుందాం. మానసిక స్థితి సరిగా లేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, పరిపాలించలేక, అభివృద్ధి చేయలేక, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు అని నాదెండ్ల విమర్శించారు.