తెలంగాణ వీణ, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఒకానొక దశలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.కాంగ్రెస్ పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. చివరకు అవి భరించలేకే ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు లేఖ విడుదల చేసిన అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్‌ను వీడటానికి దారితీసిన కొన్ని కారణాలను వివరించే క్రమంలో పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. ‘‘45ఏళ్లలో నాలుగుసార్లు గెలిస్తే.. అందులో మూడు సార్లు వరుసగా గెలిచిన బీసీ అభ్యర్థి ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. 12 ఏళ్ల పైచీలుకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అయినా నాకు పార్టీలో అవమానాలు, అవహేళనలు. కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరుల్ని కించపరిచే విధానం చూసి నాకు విసుగెత్తింది. 45 ఏళ్ల తర్వాత ఇంకా నేను తట్టుకోలేకపోయాను’’ అని అన్నారు.