తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఎన్నికల నిబంధనల పేరుతో అధికారులు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం సరి కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయడంలో తప్పులేదు. కానీ, నిబంధనల పేరు చెప్పి వివిధ వర్గాలకు చెందిన వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. నగరానికి చెందిన స్వర్ణ కారులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడి వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారి పట్ల నిబంధనల వంకతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో వ్యాపారులు ఎంతో ఆందోళన, ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయకుండా వ్యవహరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.