తెలంగాణ వీణ , జాతీయం : ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా దేశ రాజధానిలో అలజడులు రేగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రార్ధనల అనంతరం ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా నిరోధించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు.
మరికొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనూ భద్రతా సంస్ధలు అప్రమత్తం చేశాయి. ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు, సిబ్బంది, టూరిస్టులకు భద్రతను పెంచాలని మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌లో హింస ప్రజ్వరిల్లడంతో యూధులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంంతాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.