తెలంగాణ వీణ , జాతీయం : హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్ కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ దీనిపై ప్రకటన చేశారు. మైఖేల్ డగ్లస్ భార్య క్యాథరీనా జీటా జోన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత సినీ నిర్మాత శైలేంద్రసింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్టు చేస్తూ.. డగ్లస్ ఫ్యామిలీకి కేంద్ర మంత్రి స్వాగతం తెలిపారు. భారతీయ వైవిధ్య సంప్రదాయాన్ని డగ్లస్ ఇష్టపడుతారని మంత్రి పేర్కొన్నారు.
1999లో సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డును ఏర్పాటు చేశారు. సినీ రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న మైఖేల్ డగ్లస్ .. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. రెండు సార్లు ఆయనకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. అయిదు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఓసారి ఎమ్మీ అవార్డు దక్కించుకున్నాడు.