తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ‘వలంటీర్లకు నెలకు రూ.5వేలు జీతం ఇస్తున్నారు. పార్టీకి కష్టపడటం మినహా మాకేం ఒరిగింది. అందరూ బాగుపడ్డారు. చివరికి అన్యాయం అయిపోయింది మేమే!’ నంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో నెల్లూరులో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ వాస్తవ పరిస్థితి అధ్యయనం చేయడం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ఆరంభమైన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో పార్టీ పరిస్థితి, కార్యకర్తల మనోగతం తెలుసుకోవడం కోసం వైసీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరుకు వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అధ్యక్షతన కందుకూరు, కోవూరు, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో గురువారం విజయసాయి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని అధికారంలోకి తేవడం కోసం కష్టపడిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు వలంటర్లీకు దక్కిన గౌరవం కూడా దక్కడం లేదని విజయసాయి ముందు వాపోయారు.